రామన్నపేట, ఆగస్టు 31 (నమస్తే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో బెల్ట్‌షాపుల నిర్మూలనకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, అఖిలపక్ష నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు కలిసి సోమవారం మద్య నిషేధ ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.వెల్లంకి గ్రామంలో సెప్టెంబర్ 1, 2026 నుంచి బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని గతంలో గ్రామస్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా బెల్ట్‌షాపుల ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. మద్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయని, గ్రామంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

