ఉపాధ్యాయురాలి అప్రమత్తతతో తప్పిన ప్రమాదం..
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు29(నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రంలోకి విషసర్పం ప్రవేశించడంతో కలకలం రేగింది.కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు పామును గమనించి వెంటనే బయటకు వచ్చి స్థానికులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న సమయంలో ఎంపీడీవో కార్యాలయానికి పనిమీద వచ్చిన గిరిపురం మాజీ సర్పంచ్ పెద్దబోయిన జనార్ధన్ అక్కడికి చేరుకుని పరిశీలించారు.విషసర్పం బాత్రూంలో ఉన్నట్లు గుర్తించి అప్రమత్తంగా వ్యవహరిస్తూ పామును చంపేశారు.దీంతో కేంద్రంలో ఉన్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది,స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.గత నెలలో కూడా ఇదే భవిత కేంద్రంలోకి పాము రావడంతో చిన్నారులు భయభ్రాంతులకు గురయ్యారని స్థానికులు తెలిపారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
భవిత కేంద్రం పరిసరాల్లో పిచ్చిమొక్కలు,చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.విషసర్పాలు,క్రిమికీటకాలు కేంద్రంలోకి ప్రవేశించకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు వచ్చే కేంద్రం కావడంతో వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు కోరారు.


