- పంట మార్పిడితోనే రైతులకు,సమాజానికి మేలు.
- తక్కువ నీటి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలి.
- వాతావరణ మార్పులను తట్టుకునేందుకు పంట వైవిధ్యం అవసరం.
- జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
డోర్నకల్/మరిపెడ(జూలై 25)నమస్తే న్యూస్.
శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలోని గిరిజన రైతు బాదావత్ వీరన్న,బుజ్జి దంపతుల పొలంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పెసర విత్తనాలు వేసి పంట మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రీయ పద్ధతుల్లో సాగుకు అవసరమైన సలహాలు అందించాలని ఆదేశించారు.వాతావరణ మార్పులు,అకాల వర్షాలు మరియు ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి రైతులందరూ పంట మార్పిడి పద్ధతులను పాటించాలని పిలుపునిచ్చారు.కేవలం వరి,మొక్కజొన్నలకే పరిమితం కాకుండా పప్పు దినుసులు,నూనె గింజలు,కూరగాయల సాగుపై దృష్టి సారించాలన్నారు.కుసుమ,ఆయిల్ పామ్,నువ్వులు వంటి పంటలను ప్రోత్సహించాలని చెప్పారు.ప్రతి రైతు తమ భూమిని భాగాలుగా చేసి వివిధ రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించాలని కోరారు.జిల్లాలో కొత్త ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామంలో అన్ని రకాల పోషకాహార పంటలు పండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.ఉపాధి హామీ పథకంలోని పశు వైద్య కేంద్రాల సౌకర్యాన్ని ఉపయోగించి,కుక్కలకు చేసినట్లే కోతులకు కూడా సంతాన నియంత్రణ ఆపరేషన్ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని అన్నారు.అధిక యూరియా,పురుగుమందుల వాడకం వల్ల ఆహారంలో పోషకాలు తగ్గి పిల్లల శారీరక,మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.రైతులు సామాజిక బాధ్యతతో ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ,ఆరోగ్యకరమైన పంటలను పండించాలని కోరారు.తక్కువ రసాయనాలు వాడే రైతుల ఉత్పత్తులకు నగరాల్లో మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అవసరం లేని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి వేల కోట్లు ఖర్చు చేయడానికి బదులు,ఆ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు,మంచి పాఠశాలలు,కళాశాలలు నిర్మించుకోవచ్చని అన్నారు.రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచించి,ప్రభుత్వానికి సహకరిస్తూ లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కలెక్టర్ కోరారు.కార్యక్రమంలో భాగంగా భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ,బెంగళూరు వారు రూపొందించిన నల్ల తామర పురుగులు తట్టుకునే అర్క తేజస్వి రకం విత్తనాలను రైతులకు కలెక్టర్ పంపిణీ చేశారు.మధ్య తెలంగాణ జిల్లాలకు సంబంధించి మిరప సాగుపై పరిశోధనలు చేస్తున్న మల్యాల ఉద్యాన పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఈ రకాన్ని 2022 నుండి రైతు క్షేత్రాల్లో సాగు చేయించగా ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది.2026 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 250 ఎకరాల్లో ఈ విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్యాల ఉద్యాన పరిశోధన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త ప్రశాంత్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి రెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర,జిల్లా ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న,మరిపెడ వ్యవసాయ సహాయ సంచాలకులు పి.మురళి,మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి,మల్యాల కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రాం సమన్వయకర్త దిలీప్,ఉద్యాన శాస్త్రవేత్త ఎల్.సుహాసిని,వ్యవసాయ అధికారులు వీరాసింగ్,శ్రీదేవి,వ్యవసాయ విస్తరణ అధికారులు,సర్పంచ్ లచ్చుపతి,మండల అభివృద్ధి అధికారి,తహశీల్దార్,సాగునీరు,విద్యుత్,ఉద్యాన శాఖ అధికారులు శాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు.



