- హైవేపై భారీ గ్రానైట్ రాయి.
- తప్పించబోయి బోల్తా పడిన బయో డీజిల్ ట్యాంకర్.
- నేలపాలైన బయో డీజిల్…భారీగ తప్పిన ప్రాణ నష్టం.
దంతాలపల్లి,జూలై 4(నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా బీరిశెట్టి గూడెం దాట్ల క్రాస్ రోడ్ సమీపంలోని ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఓ గ్రానైట్ లారీపై ఉన్న భారీ గ్రానైట్ రాయి రహదారిపై పడిపోగా, అది గమనించని లారీ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.కొద్దిసేపటి తర్వాత ఖమ్మం వైపు నుంచి వస్తున్న బయో డీజిల్ ట్యాంకర్ రోడ్డుపై ఉన్న భారీ గ్రానైట్ రాయిని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్లో ఉన్న బయో డీజిల్ మొత్తం నేలపాలైంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు.ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారవాణా బస్సు లేదా ప్రయాణికులతో నిండిన వాహనం వచ్చి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని పేర్కొన్నారు.నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ రవాణా చేస్తున్న లారీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.గ్రానైట్ లారీల్లో భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహన యజమానులు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.



