నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
తొర్రూరు, జూలై 23, (నమస్తే న్యూస్)
ఢిల్లీలో నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు మద్దతుగా తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నీట్ లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూరి రవీంద్రాచారి మాట్లాడుతూ… నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ దేశ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ఘటన అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విద్యార్థుల తరఫున చేపట్టిన నిరసనలకు మద్దతుగా తొర్రూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నీట్ లీకేజీపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.తొర్రూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షల్లో ఇలాంటి అవకతవకలు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థుల హక్కుల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో మండల, టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

