దర్యాప్తు నాణ్యత పెరగాలి.. చట్టాలపై పూర్తి అవగాహన అవసరం
పోలీసు సిబ్బందికి వారంరోజుల ప్రత్యేక శిక్షణ ప్రారంభించిన ఎస్పీ డా. శబరీష్
మహబూబాబాద్, ఆగస్టు 3 (నమస్తే న్యూస్):
పోలీసు దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచడంతో పాటు రికార్డుల నిర్వహణ, నూతన చట్టాల అమలుపై పూర్తి అవగాహన కలిగి విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పోలీసు సిబ్బందికి సూచించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, ముఖ్యంగా స్టేషన్ రైటర్లకు వారంరోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. 2018, 2020, 2024 బ్యాచ్‌లకు చెందిన సిబ్బందికి ఈ శిక్షణ నిర్వహించనున్నారు.
ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐల పర్యవేక్షణలో ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు శిక్షణ అందించనున్నారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు, ఎఫ్‌ఐఆర్ నమోదు, కేసు డాక్యుమెంటేషన్, రికార్డుల నిర్వహణ, కోర్టు ప్రక్రియలు, సాక్ష్యాల సేకరణ, చార్జ్‌షీట్లు సిద్ధం చేయడం వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా దర్యాప్తు చేయడం ద్వారా పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియమం (BSA)తో పాటు సంబంధిత చట్టాలపై ప్రతి పోలీసు సిబ్బందికి సమగ్ర అవగాహన ఉండాలని సూచించారు.స్టేషన్ రైటర్ల పాత్ర పోలీసు స్టేషన్ పరిపాలనలో కీలకమని పేర్కొన్న ఎస్పీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, జనరల్ డైరీ, కేసు ఫైళ్లు, కోర్టు పత్రాలు, అధికారిక రికార్డులను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు.ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ శిక్షణ ద్వారా పోలీసు సిబ్బంది వృత్తి నైపుణ్యాలు పెరిగి, ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందుతాయని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.


