Type Here to Get Search Results !

బొగ్గు టిప్పర్ ఢీకొని డీటీవో వెంకన్న మృతి...మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు.

  • విధి నిర్వహణలోనే విషాదాంతం.. బొగ్గు టిప్పర్ ఢీకొని డీటీవో వెంకన్న మృతి.
  • 17 రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరణ.. ప్రమాదమా..? కుట్రా..? అనే కోణంలో దర్యాప్తు.
  • మహబూబాబాద్ జిల్లా మరిపెడ వాసి వెంకన్న మృతితో స్వగ్రామంలో విషాదం.



భూపాలపల్లి, జూన్ 22 (నమస్తే న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) వెంకన్న విధి నిర్వహణలో ఉండగానే బొగ్గు టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవలే భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంకన్న అకాల మరణం రవాణా శాఖతో పాటు జిల్లా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం డీటీవో వెంకన్న ఆధ్వర్యంలో స్కూల్ బస్సులు, ఇతర వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ లారీని ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు సమాచారం. దీంతో లారీ నేరుగా వెంకన్నను ఢీకొట్టి ఆయనపై నుంచి దూసుకెళ్లింది.నడుము భాగంపై లారీ వెళ్లడంతో వెంకన్న తీవ్ర గాయాలకు గురై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తీవ్రతకు ఆయన మృతదేహం ఛిద్రమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

17 రోజుల క్రితమే భూపాలపల్లికి బదిలీ...మరిపెడలో విషాద ఛాయలు.

2012 బ్యాచ్‌కు చెందిన వెంకన్న ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా జగిత్యాల జిల్లా నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. సుమారు 17 రోజుల క్రితమే జిల్లా రవాణా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోవడం సహచర అధికారులను కలచివేసింది.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన వెంకన్న మరణవార్త తెలిసిన వెంటనే స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే అధికారిగా పేరుపొందినట్లు సహచరులు గుర్తు చేసుకున్నారు.

ప్రమాదమా..? లేక కుట్రా..? తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రమాదం.

ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ అదుపుతప్పి ప్రమాదం జరిగిందా..? లేక కావాలనే లక్ష్యంగా చేసుకుని ఢీకొట్టారా..? అనే అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం.

డిటీవో వెంకన్న మరణం వెనుక దాగి ఉన్న నిజాలను వెలికితీయాలి:మాజీ మంత్రి,  హరీశ్ రావు డిమాండ్.

డీటీవో వెంకన్న మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పందించారు. వెంకన్న మరణం వెనుక దాగి ఉన్న నిజాలను వెలికితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక, బొగ్గు దందాలను అడ్డుకునే అధికారులను బెదిరిస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారా అనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

డీటీవో వెంకన్న మృతిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాం:రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

డీటీవో వెంకన్న మృతిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉండగా అధికారి మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వెంకన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి, ప్రమాదంపై ఉన్నతాధికారులతో మాట్లాడి సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

జిల్లావ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు, అధికారులు.

విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన డీటీవో వెంకన్న మృతిపై రవాణా శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం ప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.