ఉయ్యాల పాటకు కరుణించిన వరుణ దేవుడు.. తొలకరి జల్లులతో ఆడపడుచుల ఆనందం.
నర్సింహులపేట, జూన్ 8 (నమస్తే న్యూస్):వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తొలకరి జల్లులు ఊరటనిచ్చాయి. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్త ప్రారంభమైనప్పటికీ వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనుల ప్రారంభానికి అనుకూల వాతావరణం కోసం రైతన్నలు, గ్రామీణ ప్రజలు వరుణదేవుని ప్రార్థిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా కూలీలు పని ముగిసిన అనంతరం చెరువుల వద్ద సంప్రదాయ ఉయ్యాల పాటలు పాడుతూ కోలాటం ఆడారు. “వానలు కురువాలి ఉయ్యాలో.. చెరువులు నిండాలి ఉయ్యాలో..” అంటూ లయబద్ధంగా పాటలు ఆలపిస్తూ వర్షాల కోసం ప్రార్థించారు.మహిళల ఉయ్యాల పాటలు, కోలాటాల మధ్య వాతావరణంలో మార్పు చోటుచేసుకుని తొలకరి చిరుజల్లులు కురవడంతో అక్కడి మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించగా, రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో ఈ ఏడాది పంటలు బాగా పండాలని, చెరువులు నిండి గ్రామాలు సస్యశ్యామలంగా మారాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

