జయపురంలో ఘనంగా ముగిసిన 45 రోజుల వాలీబాల్ శిక్షణ శిబిరం.
జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
-వంగాల ప్రవీణ్ కుమార్.
నర్సింహులపేట, జూన్ 7 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో గత 45 రోజులుగా కొనసాగిన వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరం శనివారం ఘనంగా ముగిసింది. గ్రామానికి చెందిన కీర్తిశేషులు వంగాల సుదర్శన్ రెడ్డి, వంగాల రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం ఈ శిబిరాన్ని శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంగాల ప్రవీణ్ కుమార్, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో నిర్వహించారు.రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు, కోచ్ నెలకుర్తి వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొని వాలీబాల్‌తో పాటు వివిధ క్రీడల్లో శిక్షణ పొందారు. శిబిరం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగాల ప్రవీణ్ కుమార్ క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని తమకు ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి శిక్షణ శిబిరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.కోచ్ నెలకుర్తి వీరారెడ్డి మాట్లాడుతూ, 2016 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది అండర్-14 విద్యార్థులకు 45 రోజుల పాటు సమ్మర్ వాలీబాల్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం తన సొంత గ్రామంలోని విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం తనకు గర్వకారణమని చెప్పారు. తమ శిక్షణ పొందిన ఓ విద్యార్థిని జాతీయ స్థాయిలో ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించి ఆసియన్ ఛాంపియన్‌షిప్ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు.గ్రామ స్థాయిలో ఇలాంటి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుందని, మరింత మంది యువత క్రీడల వైపు ఆకర్షితులవుతారని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జయపురం సర్పంచ్ నెలకుర్తి రేణుక అశోక్ రెడ్డి, ఖమ్మం ఎక్సైజ్ సీపీ గణేష్, ఎక్సైజ్ సీఐ జంపాల రామ్మూర్తి, నర్సింహులపేట ఎస్సై బి. వెంకన్న, ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు రఘోత్తమ రెడ్డి, ఉప్పల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీరామ్ సిటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, రీజినల్ మేనేజర్ ఇమామ్ పాషా, అశోక్ రెడ్డి, మందుల యాకూబ్, రావుల శ్రీనివాస్, రాచమల్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

