Type Here to Get Search Results !

నకిలీ పత్తి విత్తనాల విక్రయంపై పోలీసుల దాడి.. 28 కేజీల విత్తనాలు స్వాధీనం.

  • నకిలీ పత్తి విత్తనాల విక్రయంపై సీసీఎస్,పోలీసుల  సంయుక్త దాడి.
  • 28 కేజీల నకిలీ విత్తనాలు స్వాధీనం.
  • ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు.


తొర్రూర్,మే31 (నమస్తే న్యూస్): రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాల విక్రయానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ హెచ్చరించారు. తొర్రూర్ మండలం టీక్యా తండాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయం జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తొర్రూర్ పోలీసులు, సీసీఎస్ బృందం సంయుక్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించి 28 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల ప్రాథమిక విచారణలో టీక్యా తండాకు చెందిన జాటోత్ వెంకన్న రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతనికి అతని అల్లుడు బర్మావత్ సోమన్న నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ లాభాలు పొందుతున్నట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.వ్యవసాయ సీజన్ ప్రారంభమైన వేళ నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. రైతుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, ప్రభుత్వ అనుమతి పొందిన విత్తన విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పదంగా విత్తనాల విక్రయం జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన తొర్రూర్ సీఐ గణేష్ , ఎస్సై మహేందర్ రెడ్డి,సీసీఎస్ సీఐతో పాటు పోలీసు సిబ్బందిని తొర్రూర్ డీఎస్పీ అభినందించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.