23న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహణ.. ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
మహబూబాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే న్యూస్):
11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బుధవారం (సెప్టెంబర్ 23) ఉదయం 10 గంటలకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.
ఈ శిబిరంలో ఆయుర్వేద, హోమియోపతి వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే ఔషధ మొక్కల ప్రదర్శన, యోగా శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య శిబిరానికి హాజరై ఉచిత వైద్య సేవలను పొందాలని డాక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.
